సైబర్ నేరాల కట్టడికి అవగాహనే మార్గం.. సైబర్ సింబాలను అభినందించిన సీపీ సజ్జనార్ 

సైబర్ నేరాల కట్టడికి అవగాహనే మార్గం.. సైబర్ సింబాలను అభినందించిన సీపీ సజ్జనార్ 
  • ఇందుకు సైబర్ సింబాలుఎంతో కృషి చేస్తున్నరు

బషీర్​బాగ్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన పెంచడమే మార్గమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్​లోని కమాండ్​కంట్రోల్ సెంటర్​లో జరిగిన కార్యక్రమంలో ‘సైబర్ సింబా’ స్వచ్ఛంద సేవకుల బృందాన్ని ఆయన అభినందించారు.

గడిచిన నాలుగు నెలల్లో 1,717 మంది వాలంటీర్లు నమోదయ్యారని, వీరు డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కేటుగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ముఖ్యంగా యువత, మహిళలు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

హైదరాబాద్​ను సైబర్ క్రైమ్ రహిత నగరంగా మార్చేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఇదే వేదికపై ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె. దొర మృతి పట్ల సజ్జనార్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఆయన ఒక గొప్ప అధికారి అని, మావోయిస్టు సమస్య పరిష్కారంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు.